Maa Telangana News
Date of Publish : 23/10/2026, 8:45 pm
Published by Muthyala Praveen Reddy

కరీంనగర్‌ను ఆదర్శ జిల్లాగా నిలుపుదాం - డ్రగ్స్ రహితంగా తీర్చిదిద్దుదాం

  • మత్తు పదార్థాల సరఫరాపై ఉక్కుపాదం.
  • విద్యాసంస్థలు, మెడికల్‌ షాపులు,బస్టాండ్ల వద్ద నిఘా.
  • గంజాయి చాక్లెట్ల విక్రయంపై కఠిన చర్యలు.
  • విద్యార్థులు,యువతను అప్రమత్తం చేయాలి.
  • జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా.

(కరీంనగర్ జిల్లా బ్యూరో/మా తెలంగాణ ప్రతినిది ప్రవీణ్ రెడ్డి)అక్టోబర్-23

విద్యార్థులు,యువత భవిష్యత్తును మత్తు పదార్థాలు ఛిద్రం చేయకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు.కరీంనగర్‌ జిల్లాను డ్రగ్స్‌,గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ,నిరంతర నిఘా,విస్తృత తనిఖీలు,అవగాహన కార్యక్రమాలతో పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు.మత్తు పదార్థాల సరఫరా, విక్రయం,వినియోగంపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.శుక్రవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి నార్కోటిక్‌ కంట్రోల్‌ సమావేశానికి కలెక్టర్‌ అధ్యక్షత వహించారు.పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం, డీఆర్వో స్వామి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కేసులు,నిర్వహించిన తనిఖీలు,మత్తు పదార్థాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు,బాధితులకు అందిస్తున్న వైద్య సేవలపై కలెక్టర్‌ సమీక్షించారు.

•యువత భవిష్యత్తుకు మత్తు పదార్థాలు ముప్పు:

డ్రగ్స్‌కు అలవాటుపడితే ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా ఆలోచనా శక్తి క్షీణించి,వ్యక్తిగత జీవితం,కుటుంబం, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని కలెక్టర్‌ పేర్కొన్నారు.ముఖ్యంగా విద్యార్థులు, యువత మత్తు పదార్థాల ఆకర్షణకు లోనుకాకుండా విద్యాసంస్థల స్థాయి నుంచే నిరంతర అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. వ్యాసరచన,ఉపన్యాస పోటీలు నిర్వహించి మాదకద్రవ్యాల దుష్పరిణామాలను వివరించాలన్నారు.విద్యార్థుల్లో చైతన్యం పెంచేందుకు పాఠశాలల్లో ప్రహరీ క్లబ్‌ల ఏర్పాటు చేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు సమావేశంలో వివరించారు.

•సరఫరాదారులపై నిరంతర నిఘా:

డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తులు,విక్రయదారులు, వినియోగదారులను గుర్తించేందుకు పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్‌ ఆదేశించారు. విద్యాసంస్థలు,మెడికల్‌ షాపులు,బస్టాండ్ల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు.ఇతర ప్రాంతాల నుంచి జిల్లాలోకి మత్తు పదార్థాలు చేరకుండా తనిఖీలు ముమ్మరం చేయాలని, అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం సేకరించి చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

•చాక్లెట్ల రూపంలో గంజాయి అప్రమత్తంగా ఉండాలి:

సాధారణ చాక్లెట్ల ముసుగులో గంజాయి చాక్లెట్లను విక్రయించే ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అధికారులు సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. ఇటీవల కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌ వద్ద బీహార్‌ కార్మికులకు అందించేందుకు తీసుకొచ్చిన 168 గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకుని,సంబంధిత వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎక్సైజ్‌ స్క్వాడ్‌ ఇన్‌స్పెక్టర్‌ దుర్గాభవాని వివరించారు.ఈ కేసు వివరాలను కలెక్టర్‌, పోలీస్‌ కమిషనర్‌కు తెలియజేశారు.చాక్లెట్ల పేరుతో గంజాయి విక్రయించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని కలెక్టర్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.పిల్లలు, యువతకు తెలియకుండా ఇలాంటి మత్తు పదార్థాలు చేరే ప్రమాదం ఉన్నందున తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనుమానాస్పద వ్యక్తులు లేదా మత్తు పదార్థాల విక్రయాల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు లేదా ఎక్సైజ్‌ అధికారులకు తెలియజేయాలని అధికారులు కోరారు.

•మత్తు పదార్థాలకు బానిసైనా బాధితులకు చికిత్స, కౌన్సెలింగ్‌:

మత్తు పదార్థాలకు బానిసైన వారిని గుర్తించి, వారిని నేరస్థులుగా చూడకుండా అవసరమైన వైద్య చికిత్స,కౌన్సెలింగ్‌ అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు.డ్రగ్స్‌ అడిక్షన్‌ సెంటర్లు, పునరావాస కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించడంతో పాటు,ఇప్పటికే వాటికి బానిసైన వారు సాధారణ జీవనంలోకి తిరిగి వచ్చేలా సహకరించాలని సూచించారు.డ్రగ్స్‌ రహిత కరీంనగర్‌ లక్ష్యాన్ని సాధించేందుకు పోలీసు,ఎక్సైజ్‌, విద్యా,వైద్య ఆరోగ్యశాఖలతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు.యువత భవిష్యత్తును కాపాడటమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేసి,మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టిన చర్యలను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం,డీఆర్వో స్వామి,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

All Rights Reserved By www.maatelangananews.com
PDF Share Save