ఒక ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి దేవుడి దయ వల్ల బాగా పంట పండి,చాలా డబ్బు వచ్చింది.డబ్బు రాగానే రామయ్య మారిపోయాడు.పొలంలో పనిచేసే వారికి తక్కువ కూలీ ఇచ్చేవాడు. ఇంట్లో అన్నం వృథా చేసేవాడు. భార్యతో "డబ్బు ఉంది కదా,ఏదైనా కొనొచ్చు" అని గర్వంగా మాట్లాడేవాడు.
ఒకరోజు ఒక సాధువు ఆ ఊరికి వచ్చాడు. రామయ్యను చూసి ఇలా అన్నాడు.
"నాయనా,లక్ష్మీదేవి చంచలమైనది. ఒకచోట ఉండదు.ఆమె నీ దగ్గర ఎప్పుడూ ఉండాలంటే 3 పనులు చేయాలి" అన్నాడు.
1. కష్టపడి సంపాదించాలి: చెమటోడ్చి సంపాదించిన డబ్బుకే విలువ ఉంటుంది. అడ్డదారిలో వచ్చిన డబ్బు అడ్డదారిలోనే పోతుంది.
2. వృథా చేయకూడదు: ఆహారాన్ని, డబ్బును,నీటిని వృథా చేయకూడదు. లక్ష్మీదేవి పరిశుభ్రత ఉన్న చోటే ఉంటుంది.
3. దానం చేయాలి: ఉన్నదాంట్లో కొంత ఇతరులకు పెట్టాలి.పేదవారికి సాయం చేస్తే, లక్ష్మీదేవి సంతోషించి మన దగ్గరే ఉంటుంది.
అప్పటి నుండి రామయ్య మారిపోయాడు. కూలీలకు సరైన జీతం ఇచ్చాడు,అన్నం వృథా చేయడం మానేశాడు,ప్రతి పౌర్ణమికి అన్నదానం చేసేవాడు.లక్ష్మీదేవి దీవెనలు అతనికి ఎల్లప్పుడూ ఉండిపోయాయి.
*నీతి:* డబ్బును గౌరవిస్తే,డబ్బు మనల్ని గౌరవిస్తుంది.
Written By: Muthyala Praveen Reddy