*హైదరాబాద్/మా తెలంగాణ ప్రతినిధి:* కేసీఆర్ ను సీఎంగా చూడాలని రాష్ట్రంలోని యువత బలంగా కోరుకుంటుందని చెప్పేందుకు తాజా ఘటన మరో ఉదాహరణగా నిలిచింది.కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఓ యువకుడు పాదయాత్ర చేసి కేసీఆర్ ను కలుసుకున్నాడు.తెలంగాణ ఉద్యమం నుండి నేటి వరకు కేసీఆర్ చేసిన సేవలను ఆ యువకుడు గుర్తు చేసుకున్నాడు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14ఏళ్లు పోరాడి, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ అని అన్నారు. అలాంటి నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుందని ఆ యువకుడు ఆకాంక్షించాడు.
*మహబూబ్ నగర్ నుండి ఎర్రవల్లి వరకు పాదయాత్ర:*
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం నుండి ఎర్రవల్లి లోని కేసీఆర్ నివాసం వరకు సుమారు 100 కిలోమీటర్లకు పైగా ఆ యువకుడు కాలినడకన వచ్చాడు.చేతిలో కేసీఆర్ చిత్రపటం,జై తెలంగాణ నినాదాలతో అతను చేసిన పాదయాత్ర అందరినీ ఆకర్షించింది.దారి పొడవునా పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజలు అతనికి మద్దతు తెలిపారు.
*కేసీఆర్ స్పందన:*
ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో యువకుడిని కేసీఆర్ ఆప్యాయంగా పలకరించారు.అతని ఆలోచనను,తెలంగాణ పట్ల ఉన్న ప్రేమను అభినందించారు.కొన్ని నిమిషాల పాటు అతనితో మాట్లాడి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.యువత ఇలా ఆలోచించడం గొప్ప విషయమని,తెలంగాణ భవిష్యత్తు యువత చేతిలోనే ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, రైతుబంధు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని ఆ యువకుడు తెలిపాడు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆ పథకాలు సరిగా అమలు కావడం లేదని, అందుకే కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని తాను పాదయాత్ర చేశానని చెప్పాడు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ మళ్లీ రావాలనే నినాదం బలంగా వినిపిస్తోందని, యువతలో ఆ ఆలోచన మరింత బలంగా ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.ఈ యువకుడి పాదయాత్ర కూడా అందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు.